హైదరాబాద్‌కు ముఖద్వారం ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే… ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రూటే సెపరేటు. చుట్టపక్కల జిల్లాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడిన వారు ఇక్కడ ఎక్కువ. గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లోని 11 డివిజన్లను క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్ ఈసారి అదే రిజల్ట్స్ రిపీట్ చేస్తుందా? బలం, బలగం ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి పోటీని ఇస్తాయి.ఎల్బీనగర్ నగర్ ఓటరు ఎటువైపు నిలుస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో అత్యధిక డివిజన్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే. అందుకే అన్ని పార్టీలకు ఈ నియోజకవర్గం కీలకం. ఈ అసెంబ్లీస్థానంలో… నాగోల్, మన్సురాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజిగూడ, చైతన్యపురి, గడ్డి అన్నారం, కొత్తపేట.. డివిజన్లు ఉన్నాయి. 2016లో ఇక్కడ ఉన్న అన్ని డివిజన్లను టీఆర్ఎస్ దక్కించుకుంది. కారుజోరుకు విపక్ష పార్టీలేవీ బ్రేకులు వేయలేకపోవడంతో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం..అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించారు. తర్వాత సుధీర్ రెడ్డి అధికార టీఆరెస్ పార్టీలో చేరిపోయారు.
ఇక 11 డివిజన్లలో అభ్యర్థులను ఓసారి పరిశీలిస్తే… అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు ఉంటుందని అనుకున్నారు కానీ… సిట్టింగ్‌లందరికీ సీట్లేచ్చేసింది టీఆర్ఎస్. మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతోంది. సుధీర్ రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లడంతో… ఇక్కడ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మల్రెడ్డి రాంరెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో నాలుగైదు డివిజన్లలో బలంగా కొట్లాడగలం.. అనే ధీమాతో ఉంది. ఇక బీజేపీ సామా రంగారెడ్డి బాధ్యతలు అప్పగించింది. దీంతో తెలుగుదేశం నుంచి బీజేపీకి వచ్చిన సామా తన క్యాడర్‌నంతా బీజేపీకి షిఫ్ట్ చేశారు. కానీ… పాత ఇంఛార్జి పేరాల శేఖర్‌కు, సామాకు మధ్య సమన్వయ లోపం… బీజేపీకి ఇబ్బందిగా మారే ప్రమాదముంది.
ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి డివిజన్లో దాదాపు 50వేల మంది చొప్పున ఓటర్లున్నారు. ఇక్కడ కుల సమీకరణాలు… రాజకీయ పరిణామాల ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువ. ఆంధ్ర నుంచి వచ్చిన వారేకాదు… తెలంగాణలోని నల్గొండ.. వరంగల్.. మహబూబ్‌నగర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఎక్కువగా కనిపిస్తారు. ఎన్నికల్లో తెలంగాణవారితో పాటు ఆంధ్ర ప్రాంతం వారు… రాజకీయాన్ని ప్రభావితం చేస్తాయి.
బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, లింగోజిగూడ లాంటి డివిజన్లలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కులాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపిస్తుంది. అయితే బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కొన్ని డివిజన్లలో కమ్మ సామాజికవర్గం ప్రభావం కూడా కనిపిస్తుంది. హస్తినాపురం డివిజన్లో ఎస్టీలు ఎక్కువగా కనిపిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతం… పొరుగున ఉన్న పాలమూరు జిల్లా నుంచి వచ్చి స్థిరపడ్డ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఇక డివిజన్లలో సాధారణంగా ఉండే డ్రైనేజీ… మంచినీళ్లలో మురుగు నీరు కలవడం.. అంతర్గత రోడ్లు లేకపోవడం… బస్తీల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా హస్తీనాపురం డివిజన్లో ఈ సమస్యలు ఎక్కువ. వర్షం వచ్చిందంటే సాగర్ ఎంక్లేవ్ వరద పారుతుంది. ఇది నిత్యకృత్యం. హయత్‌నగర్‌లోని ఆటోనగర్‌లో ఇసుక లారీల పార్కింగ్ సమస్య ఇప్పటిది కాదు. అందరూ చర్యలు తీసుకుంటామంటారే కానీ, ఎందుకు తీసుకోరో.. ఎవరికీ అర్థంకాదు.
ఇక బీఎఎన్ రెడ్డి నగర్లో మాత్రం… రిజిస్ట్రేషన్ల సమస్య వేధిస్తోంది. ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్ ఆగి 17ఏళ్లవుతుంది. వచ్చిన ప్రతి నాయకుడు చిటికెలో సమస్య పరిష్కరిస్తాం అంటారు. కానీ గెలవగానే ఎవరూ పట్టించుకోరని … స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వనస్థలిపురం డివిజన్ పైకి బాగానే కనిపించినా ఏం లాభం.. చిన్న వాన వచ్చిందంటే చాలు.. కాలనీలు అన్నీ వరదల్లో మునగాల్సిందే. ఇక్కడ గుడిసెల్లో నివసించేవారిని ప్రభుత్వం ఖాళీ చేయించింది. వాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. అయితే ఇప్పటికీ ఇవ్వకపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిగా మారి ఇబ్బందులు పడుతున్నారు పేదలు.
ఇక గడ్డి అన్నారం డివిజన్ కి ప్రధాన సమస్య సరూర్ నగర్ చెరువు. ఓ వైపు దుర్గంధం.. మరో వైపు నాలాలు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇక్కడి కోదండరాం నగర్ అంతా నీట మునిగింది. వాకింగ్‌కి వెళ్లిన మహిళ నాలాలో పడి చనిపోయింది. వర్షం వచ్చిందంటే ఇక్కడి కాలనీవాసులకు కంటిమీద కునుకుండదు. చైతన్యపురి డివిజన్లో నాలుగేళ్ల క్రితం గుడిసెలు కూల్చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యల మధ్య మరోవారంలో ఎన్నికలు గ్రేటర్ జరగబోతున్నాయి. మరి ఎల్బీనగర్ ఓటర్ గతంలో మాదిరిగానే క్లీన్ స్వీప్ తీర్పిస్తాడా.. లేదంటే… విపక్ష పార్టీలకు పట్టం కడతాడా అన్నది త్వరలోనే తేలిపోనుంది.