సాధారణంగా ఎవరైనా సరే మాతృభాష కాకుండా ఇతర భాషలను ఎక్కువగా నేర్చుకోరు. ఇంగ్లిష్ అంటే అవసరం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ పాఠశాల స్థాయి నుంచే దాన్ని నేర్చుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన భాషలను ఎవరూ నేర్చుకోరు. డిగ్రీ, పీజీ కోర్సులు చేసేవారికి మార్కుల కోసం లేదా ఆయా దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ భాషలు ఉపయోగపడతాయి. అయితే ఎవరైనా సరే ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు వెల్లడించారు.
జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో సైంటిస్టులు కొందరు వాలంటీర్లపై పరిశోధనలు చేశారు. వారు ఐరోపా దేశాలకు చెందిన వారు. వారికి జపనీస్ భాష రాదు. వారికి కొన్ని వారాల పాటు జపాన్ భాష క్లాసులు చెప్పారు. దీంతో తేలిందేమిటంటే.. వారిలో లాంగ్వేజ్ స్కిల్స్ మెరుగు పడ్డాయని, మెదడు పనితీరు పెరిగిందని, కొన్ని భాగాలు యాక్టివ్‌గా మారాయని చెప్పారు.
నూతన భాషలను నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తాయని, ఇది వృద్ధాప్యంలో అల్జీమర్స్ వంటివి రాకుండా చేస్తుందని తెలిపారు. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి సమస్యలతో బాధపడే వారు ఇతర భాషలను నేర్చుకోవడం వల్ల మెదడు ఉత్తేజమై ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఈ వివరాలను ఫ్రాంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరో సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.