దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే అరకు పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీని కూడా తీసుకొచ్చింది. సందర్శకుల మనసు దోచేలా పర్యాటకాన్ని మెరుగు పర్చనుంది. ఆంధ్రా ఊటిగా పేరుగాంచిన అరకు కొత్త పాలసీతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది.
పచ్చని కొండలు.. నీలి సముద్రం.. మనసును దోచుకునే సహజ సిద్ధమైన అందాలు.. వీటన్నిటి కలబోతే విశాఖపట్నం. విశాఖ అందాలను చూసి పర్యాటకులు ఫిదా అవ్వాల్సిందే. అరకు, లంబసింగి వరకూ ఎటూ చూసినా ప్రకృతి పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దేశ విదేశాల నుంచి విశాఖ పట్నానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఆకట్టుకునే జలపాతాలు..
జలపాతాల హోయలు ముచ్చట గొలుపుతాయి. మన్యంలోని జలపాతాలు పర్యాటకులను కట్టిపడేసేలా ఉంటాయి. అనంతరగిరిలోని కటిక, డుంబ్రిగూడలోని చాపరాయి, పెదబయలులోని పిట్టలబొర్ర, దేవరాపల్లిలోని సరయూ, ఒడిశా సరిహద్దులోని ముంచంగిపట్టులోని డుడుమ ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకులను మైమరపిస్తాయనే చెప్పుకోవచ్చు.
లంబసింగిలో చలి ఎక్కువే..
మన్యంలో అరకు లోయకు పోటీగా పర్యాటకులను ఆకట్టుకోవడానికి లంబసింగి పోటీ పడుతోందనే చెప్పుకోవచ్చు. వైజాగ్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం. ఈ మండలం పరిధిలోని 50 తండాల్లోనూ శీతాకాలంలో అతి చల్లని వాతావరణం ఉంటుంది. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే శీతాకాలం ప్రారంభం నుంచే ఇక్కడ చలి ఎక్కువ. ఎత్తైన చెట్లతో దట్టమైన అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ కాఫీ, మిరియాల తోటలు, స్ట్రాబెర్రీ మొక్కలు కనిపిస్తుంటాయి. కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఇదో బెస్ట్ స్పాట్. తాజంగి జలాశయంపై జిప్ లైన్, కొండల మధ్య రోప్ కూడా నిర్వహిస్తుంటారు.
టెంటు హౌస్ లు..
లంబసింగిలో బస చేయాలని అనుకునే వారికి ఏపీటీడీసీ రిసార్ట్స్ నిర్మాణ పనులు చేపడుతోంది. హరిత హిల్ రిసార్ట్ లో జర్మనీ సాంకేతికతను జోడించి నాలుగు ఏసీ టెంటు హౌస్ లను ఏర్పాటు చేసింది. ఎనిమిది సూట్ రూంలను నిర్మిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
టూర్ ప్యాకేజీ..
మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ పెద్దలకు రూ.999, చిన్న పిల్లలకు రూ.799 టికెట్ ధరను నిర్ణయించింది. అరకు నుంచి లంబసింగితోపాటు చాపరాయి, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలు, పండ్ల తోటలను కలిపి మరో ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చారు. రోజూ ఉదయం 7 గంటలకు బస్సు బయలు దేరి ఆయా ప్రాంతాలు చుట్టేసి రాత్రికి తిరిగి వస్తుంది.