చారిత్రక కథల నుండి విలువైన జీవిత సత్యాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అటువంటి అద్భుతమైన మార్గదర్శకత్వాలలో ఒకటి విదుర నీతి. మహాభారతంలోని ఈ జ్ఞాన నిధి విజయానికి ధర్మానికి ప్రశాంతమైన జీవితానికి మార్గాలను సూచిస్తుంది. ఆధునిక జీవితంలోని ఒత్తిడిలో విదురుడి ఆలోచనలు మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. మరి జీవితంలో విజయం సాధించడానికి విదురుడి నీతిని మనం ఎందుకు తెలుసుకోవాలి? కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం..
జీవిత విజయం: విదుర నీతి అనేది కేవలం పురాతన ధార్మిక ఉపదేశాలు మాత్రమే కాదు, అది శాశ్వతమైన నిర్వహణ, జీవిత నైపుణ్యాల పాఠశాల. కురుక్షేత్ర యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన ఈ సూక్తులు కేవలం రాజులకే కాదు నేటి సామాన్యుడికి కూడా జీవితంలో విజయ పథాన్ని చూపుతాయి.
ఆరుగురి నుండి దూరంగా ఉండాలి: విజయానికి అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఇది ఒకటి. విదురుడి ప్రకారం ఈ ఆరు రకాల వ్యక్తులు ఎప్పుడూ అభివృద్ధి చెందలేరు లేదా ఇతరుల పురోగతిని చూడలేరు.అతి గర్వం ఉన్న వ్యక్తి,సంతుష్టి లేని వ్యక్తి, అతి కోపం ఉన్న వ్యక్తి, అతిగా మాట్లాడే వ్యక్తి నిరంతరం భయం ఉన్న వ్యక్తి, దీర్ఘము గా ఆలోచన చేసే వ్యక్తి. ఈ లక్షణాలు ఉన్నవారిని లేదా వాటిని తమలో కలిగి ఉన్న వ్యక్తి విజయం సాధించడం అసాధ్యం. వాటిని వదిలించుకోవడమే మొదటి అడుగు.

నిజమైన శక్తి (సత్యం): విదురుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం సత్యం. నిజాయితీ మరియు ధర్మబద్ధమైన మార్గంలో నడవడం విజయానికి పునాది. కేవలం డబ్బు లేదా అధికారం విజయాన్ని ఇవ్వదు. ధర్మం పట్ల విధేయత, కష్టపడి పనిచేయడం మరియు మంచి మనసు కలిగి ఉండటం ఇవే నిజమైన శక్తి. సత్యం మాట్లాడేవారు ధర్మంగా నడిచేవారు ఇతరుల పట్ల దయ చూపేవారు చివరకు విజయం సాధిస్తారని విదురుడు బోధించాడు.
ఇంద్రియ నిగ్రహం: విజయం సాధించడానికి కోరికలను మరియు ఇంద్రియాలను నియంత్రించడం చాలా ముఖ్యం. విదురుడి నీతిలో అదుపు లేని కోరికలు మరియు కోపం వైఫల్యానికి దారితీస్తాయని స్పష్టంగా చెప్పబడింది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అనావసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యం వైపు పయనించడం విజయానికి మార్గం. ఇంద్రియాలను జయించిన వ్యక్తి లోకంలో దేనినైనా జయించగలడు.
విదుర నీతి అనేది కేవలం గతాన్ని గుర్తుచేసే గ్రంథం కాదు. అది నేటికీ ఆచరణీయమైన ప్రశాంతమైన విజయవంతమైన జీవితానికి ఒక ప్రామాణిక మార్గదర్శి. ఈ సూత్రాలను మన దైనందిన జీవితంలో అమలు చేయడం ద్వారా మనం కూడా ధర్మాన్ని పాటించి నిజమైన విజయాన్ని సాధించగలం.