ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఎన్నో కోట్ల మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 73 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని ప్రభుత్వ రంగ సంస్థలు విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి బాధితులు ఉద్యోగాలను వెతుక్కోవడం కూడా కష్టంగా మారింది. అయితే ఉద్యోగాలను కోల్పోయిన వారు కింద తెలిపిన మార్గాల్లో డబ్బులను సంపాదించవచ్చు. అవి ఏమిటంటే…
1. ఆన్‌లైన్ సెల్లింగ్
ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. అందువల్ల అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సైట్లలో ఉత్పత్తులను అమ్మి డబ్బులు సంపాదించవచ్చు.
2. ఫ్రీ లాన్సర్, కన్సల్టెంట్
డిజైనింగ్, రైటింగ్, బ్లాగ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ వంటి అంశాలతోపాటు మీకున్న నైపుణ్యాలను బట్టి ఫ్రీ లాన్సర్‌గా పనిచేయవచ్చు.
3. బ్లాగర్
ఆకట్టుకునే విధంగా కథనాలు, వార్తా విశేషాలు రాయగలం అనుకునే వారు సొంతంగా బ్లాగ్ లేదా వెబ్‌సైట్‌ను ప్రారంభించి వాటి ద్వారా డబ్బులు ఆర్జించవచ్చు.
4. అఫిలియేట్ మార్కెటింగ్
అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు అఫిలియేట్ మార్కెటింగ్‌ను అందిస్తున్నాయి. ఆ సైట్‌లో ఉండే కంపెనీలకు చెందిన ఉత్పత్తులను అమ్మి పెడితే కమిషన్ పొందవచ్చు. అందుకుగాను అమెజాన్‌లో ముందుగా అఫిలియేట్‌గా దరఖాస్తు చేసుకోవాలి. తరువాత అందులో మీకు నచ్చిన ప్రొడక్ట్‌లకు చెందిన లింక్‌లను సేకరించి వాటిని సోషల్ మీడియా లేదా వెబ్‌సైట్లలో పోస్టు చేయాలి. ఆ లింక్‌లను క్లిక్ చేసి అమెజాన్‌లోకి ప్రవేశించి ఆ వస్తువులను కొంటే మీకు ఒక వస్తువుకు ఫలానా మొత్తం అని కమిషన్ ఇస్తారు.
5. యూట్యూబ్ చానల్
మీకు ఏదైనా అంశంలో ప్రావీణ్యత ఉంటే దాంతో యూట్యూబ్ చానల్ ప్రారంభించవచ్చు. అంటే మీరు వంటలు బాగా చేయగలరనుకుంటే వాటికి చెందిన వీడియోలను తీసి యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. దీంతో గూగుల్ ద్వారా ఆ వీడియోలను మానెటైజ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.