ప్రేమకీ, ఆకర్షణకీ చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితేనే అది ప్రేమ అని తెలుస్తుంది. కానీ అది తెలిసేదెలా? మీరు ప్రేమిస్తున్నారో లేదా ఆకర్షణకి గురవుతున్నారో ఎలా తెలుసుకుంటారో ఇక్కడ చూద్దాం.
ముందుగా ఆకర్షణ లేకుండా ప్రేమ పుట్టదని తెలుసుకోవాలి. అది ఎలా అయినా, ఒకరి అందం చూసైనా, పర్సనాలిటీ చూసైనా, క్యారెక్టర్ చూసైనా ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణే ప్రేమకి దారి తీస్తుంది. కానీ అన్ని ఆకర్షణలు ప్రేమ వరకు వెళ్ళాలని నియమం లేదు. అందుకే ఆకర్షణలో ఆగిపోయే వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే దాన్నే ప్రేమనుకుని అనవసరంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.
ఆకర్షణ కలిగినపుడు అవతలి వారి మీద అనేక అంచనాలు ఉంటాయి. మంచి బట్టలు వేసుకోవాలనీ, చూడడానికి అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ ప్రేమ వీటన్నింటినీ పెద్దగా పట్టించుకోదు.
ఆకర్షించే వారు ఎక్కువగా మిమ్మల్ని పొగడడానికే చూస్తారు. వారి మాటలు కేవలం నోటి ద్వారా మాత్రమే వస్తాయి. మనసు నుండి మిమ్మల్ని పొగడరు. పొగడడం వల్ల మీలో కలిగే ఆనందాన్ని, వారు గురించి ఆలోచించేలా చేస్తాయనే ఆలోచిస్తారు.
ఆకర్షణకి అరుపు ఎక్కువ. ప్రేమ చాలా కామ్ గా ఉంటుంది.
ఆకర్షణ ఒక్కరితో ఆగిపోదు. అది ప్రతీ సారి కొత్త ఆకర్షణలని కోరుకుంటుంది. ప్రేమ ఒక్కరినీ మాత్రమే కోరుకుంటుంది. ఒక్కరితో మాత్రమే ప్రేమగా ఉండగలరు. మీరొక్కరే ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అలా మీరు ప్రేమించిన వారితో మాత్రమే ఉండగలరు. అలా ఉండగలిగినపుడే అది ప్రేమ అవుతుంది. మీరు ప్రేమలో పడే ముందు వీటన్నింటినీ ఆలోచించుకోండి.