మాచర్ల ఫైట్: రేపు అధికారం మారితే..!

-

మాచర్ల రాజకీయాలు ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే..వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య గొడవ తారస్థాయికి వెళ్ళి..దాడులు చేసుకునే వరకు వెళ్లింది. అలాగే ఇళ్లని తగలబెట్టడం, టీడీపీ ఆఫీసుని తగలబెట్టారు. అటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయి. శుక్రవారం టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి..ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా మాచర్ల టౌన్‌లో ప్రజలని కలిసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న వైసీపీ శ్రేణులు టీడీపీ వాళ్ళని అడ్డుకోవడానికి చూశారు. అలాగే రాళ్ళు, గాజు సీసాలతో టీడీపీ వాళ్లపై దాడి చేశారు.

దీంతో టీడీపీ శ్రేణులు..రాళ్ళు, కర్రలతో వైసీపీ శ్రేణులపై దాడి చేశాయి. ఈ లోపు పోలీసులు టీడీపీ వాళ్ళని అడ్డుకున్నారు..జూలకంటిని అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు..టీడీపీ వాళ్ళని ఇష్టమొచ్చినట్లు కొట్టారు..ఇల్లు తగలబెట్టారు. ఆ సమయంలో వైసీపీ వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ మాచర్ల రచ్చపై తప్పు మీది అంటే మీది అని వైసీపీ-టీడీపీ వాళ్ళు ఆరోపించుకుంటున్నారు.

ఇదే క్రమంలో గుంటూరు టీడీపీ నేతలు మాచర్ల వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ధూళిపాళ్ళ నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు లాంటి నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడకక్కడ టీడీపీ నేతలని గృహ నిర్భందం చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి..ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తున్నారని వారికి పోలీసులు సహకరిస్తున్నారని, రేపు అధికారం మారితే పరిస్తితి ఏంటో ఊహించుకోవచ్చు అని టీడీపీ శ్రేణులు ఘాటుగా స్పందిస్తున్నాయి.

అధికార అండతో మాచర్లలో రౌడీ ముఠాలు చేలరేగి పోతున్నాయని,  రేపు అధికారం మారితే మీ పరిస్థితి ఏంటో ఆలోచన చేయండని టీడీపీ నేత యరపతినేని  శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. అధికారం మారిన మరుక్షణం మాచర్ల రౌడీ దండు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళతారని అన్నారు. మొత్తానికి అధికారం అనేది ప్రత్యర్ధులని అణచడానికి అన్నట్లు అటు వైసీపీ, ఇటు టీడీపీ నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version