తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ వద్ద ‘తోడుదొంగలు’అనే పోస్టర్ ప్రచారం సందర్భంగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోన్నది. గోడలకు పోస్టర్లు అతికించే సమయంలో అనుమతి లేదంటూ అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తోడు దొంగలు అనే పోస్టర్‌ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, డీసీసీ సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. గత నెల 12న తోడు దొంగలు బీఆర్ఎస్, బీజేపీలపై ప్రజాఛార్జ్ షీట్ పేరుతో ‘తిరగబడదాం-తరిమికొడదాం’ నినాదంతో ప్రచార పోస్టర్‌ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. ఈ నినాదంతోనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రచారం సాగిస్తామని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాకోర్టులో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని.. పోస్టర్‌ను ప్రారంభించారు.