పాలమూరు బీజేపీలో మళ్లీ ముసలం మొదలైందా

-

పాలమూరు జిల్లా కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో జిల్లాలో చక్రం తిప్పిన రాజకీయ ఉద్దండులకు కాషాయ కండువాలు కప్పేసిన ఆ పార్టిలో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రాజీనామా వ్యవహరం కలకలం రేపుతోంది. నేతల మధ్య ఆధిపత్యపోరుతో అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెనక్కి తగ్గిన మాజీ ఎమ్మెల్యే మళ్లీ పదవి వీడేందుకు సిద్ధ పడుతుండటంతో కమలదళంలో మళ్లీ ముసలం మొదలైంది

మహబూబ్ నగర్ జిల్లాలో హేమాహేమీలు చేరికతో భవిష్యత్‌ అంతా పూలబాటే అని లెక్కలేసుకున్నారు కమలనాథులు. కానీ పాత, కొత్త క్యాడర్ మధ్య పొసగక ఆ పార్టి జిల్లా అధ్యక్షుడు తన పదవి వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి గత డిసెంబర్ లో తొలిసారి పాలమూరు లో పర్యటన చేపట్టిన క్రమంలో అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఆ సమయంలో సంచలనంగా మారింది. అధిష్టాన పెద్దల బుజ్జగింపుతో సాయంత్రానికి నిర్ణయం మార్చుకున్న ఎర్ర శేఖర్ అప్పటి నుంచీ అంటి ముట్టనట్లే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ పక్క సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని మరో మారు గెలుచుకునేందుకు బిజెపి శ్రేణులు తహతహలాడుతుంటే..జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనంటూ అధిష్టాన పెద్దలకు ఎర్ర శేఖర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో జిల్లా బిజెపి కొత్త అధ్యక్షుడెవరనే చర్చ మొదలైంది.
క్రమశిక్షణకు కేరాఫ్ గా ఉండే పాలమూరు కమలం పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ స్థానికంగా సాగుతోంది . పాత, కొత్త నేతల మద్య సయోద్య లోపించినట్లు విశ్లేషకులు చెబుతుండగా ఇతర పార్టీల నుంచి బిజెపి లో చేరిన వారు ఇక్కడ ఇమడ లేక పోతున్నారనేది పార్టీ ఇంటర్నల్ టాక్.

టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది ఆగస్టులో బిజెపిలో చేరారు ఎర్ర శేఖర్ . ప్రస్తుతం రాష్ట్ర , జాతీయ పార్టీలో కీలక పదవుల్లో ఉన్ననేతల ఆశీస్సులతోనే ఎర్రశేఖర్ కు బిజెపి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. అయితే జిల్లా అధ్యక్షుడిగా నియామకం జరిగినప్పటి నుంచి పాత నేతల్లోని ఓ వర్గం నుంచి సహాయ నిరాకరణ జరుగుతుందనే అభిప్రాయం తో ఉంది ఎర్ర శేఖర్ వర్గం. మరో పక్క పాత, కొత్త నేతలకు అసలే పొసగడం లేనట్లు తెలుస్తోంది. చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని పాత నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప స్వంత నిర్ణయాలతో చేసే పరిస్థితి లేనందువల్లే ఎర్ర శేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీజేపీలోని పాత టీం అంతా మాజీ ఎంపి జితేందర్ రెడ్డి చెంతన చేరి పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు వ్యవహరిస్తోందని ఎర్ర శేఖర్ వర్గం అభిప్రాయ పడుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావును తమ అభ్యర్దిగా ప్రకటించి మరో మారు గెలుపు కోసం బిజెపి శ్రేణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ….ఎర్ర శేఖర్ మాత్రం లైట్ తీసుకోని హైదరాబాద్ కే పరిమితం కావడం పై జిల్లా కమలం శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. గతంలో నాగం జనార్దన్ రెడ్డి , యెన్నం శ్రీనివాస్ రెడ్డి లు పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమైన పరిస్థితులే మళ్లీ ఇప్పుడు పునరావృత్తమయ్యాయన్న చర్చ పార్టీలో నడుస్తుంది.

మొత్తం మీద కమలం పార్టి జిల్లా అధ్యక్షుడి పదవిని వీడేందుకు సిద్దమైన ఎర్ర శేఖర్ పార్టీని కూడా వీడుతారనే ప్రచారం సాగుతోంది. దీన్ని కమలదళం ఎలా చక్కబెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version