సినీతారలు.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇతర వ్యాపార రంగాల్లోనూ సత్తా చాటుతుంటారు. ఇప్పటికే పలువురు స్టార్స్ పలు రకాల బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. వీరిలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఒకరు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులనిండా సంపాదిస్తున్నారు. అందులో ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్ కూడా ఒకటి. అయితే తాజాగా ఆయన మరో వ్యాపారం పెట్టబోతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాలీవుడ్ స్టార్స్.. ఏఏ వ్యాపారాల్లో రాణిస్తున్నారో ఓ సారి అలా తెలుసుకుందాం..
క్లౌడ్‌కిచెన్.. సినీ ప్రముఖులు ఆహార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు. అందులో నాగచైతన్య కూడా చేరాడు. కొంతకాలం క్రితం ‘షోయూ’పేరుతో క్లౌడ్‌కిచెన్‌ను ఆరంభించి స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ విషయాన్ని తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘స్వతహాగా నేను ఆహారప్రియుడిని. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల వంటకాలను రుచిచూశా. వాటన్నింట్లో ఆసియా వంటకాలను ఎక్కువగా ఇష్టపడతా. ఆ రుచులను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లౌడ్‌కిచెన్‌ను ఏర్పాటుచేశా’నని చెప్పారు చైతు.
సమంత.. సినిమాలతో క్షణం తీరిక లేకపోయినా సేవకూ, తనకు ఇష్టమైన పనులు చేసేందుకూ సమయం కేటాయించే సమంత కొన్నాళ్ల క్రితం ‘సాకీ’ పేరుతో ఆన్‌లైన్‌లో డిజైనర్ దుస్తుల సంస్థను ప్రారంభించింది. ‘ఇప్పుడంటే ఓ నటిగా పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను వేసుకుంటున్నా కానీ.. చదువుకునేటప్పుడు నా దగ్గర ఒక్క డిజైనర్ వేర్ కూడా లేదు. దాంతో ఎప్పటికైనా ఓ డిజైనర్‌స్టోర్‌ని ఏర్పాటు చేయాలనుకున్నా. ఆ ఆలోచన నుంచే సాకీ వచ్చింద’ని చెప్పే సమంత ఆ మధ్య ‘ఏకమ్’ అనే కిండెర్‌గార్డెన్ పాఠశాలలోనూ భాగస్వామి అయ్యింది.
కీర్తి సురేష్…చర్మ, కేశ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల తయారీలో రాణిస్తోంది. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి ‘భూమిత్ర’ పేరుతో ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ స్టోర్‌లో రసాయనాలు లేని సీరమ్‌లు, నూనెలు, ఫేస్‌ప్యాక్‌లు… ఇలా చాలానే ఉన్నాయి. ‘మా బామ్మ చర్మం, జుట్టూ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగానే కనిపిస్తాయి. తాను పసుపు, సెనగపిండి, చందనం, నిమ్మకాయ, ఉసిరికాయ, మెంతులు, మందారాల్లాంటివే ఎక్కువగా వాడుతుంది. ఆ సౌందర్య చిట్కాలను సామాన్యులకూ పరిచయం చేయాలనే ఆలోచనతోనే ఎన్నో ప్రయోగాలు చేసి మరీ భూమిత్రను ప్రారంభించా…’మని చెప్పిందికీర్తి.
డ్రెస్ ప్లస్ మల్టీప్లెక్స్.. సెన్షేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లోనే ‘రౌడీవేర్’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఆ తరవాత ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగానూ మారాడు. అక్కడితోనే ఆగిపోకుండా మహబూబ్‌నగర్‌లో ‘ఏషియన్ విజయ్‌దేవరకొండ సినిమాస్’ పేరుతో మల్టీప్లెక్స్‌ను కూడా నిర్మించాడు. ‘ఓ సాధారణ యువకుడిగా సినిమాల్లోకి రావడానికీ, ఇక్కడకు వచ్చాక నిలదొక్కుకోవడానికీ చాలా కష్టాలు పడ్డా. ఇప్పుడు హీరోగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్న నేను ఇక్కడితోనే ఆగిపోకూడదనుకున్నా. అందుకే దుస్తుల వ్యాపారం, నిర్మాణరంగంలోకి వచ్చా. ఇక సినిమా హాలు కట్టించుకోవాలనుకున్న కోరికా తీరింద..’ని చెప్పాడు విజయ్.