దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఎవరు నిర్లక్యం వహించొద్దని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే కరోనా ముప్పు తగ్గించడానికి ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాస్కు అవసరం లేదా అనే అంశంపై చర్చ మొదలైంది.
అయితే ఈ విషయంపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వివరణ ఇచ్చారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని, అలాగే భౌతిక దూరం కూడా పాటించాలని స్పష్టం చేశారు. రోజురోజుకీ వైరస్ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్ వేరియంట్లపై వ్యాక్సిన్లు ఎంత ప్రభావం చూపుతాయో కచ్చితంగా చెప్పలేమన్నారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకున్న, తీసుకోకున్న మాస్కులు మాత్రం తప్పనిసరి ధరించాల్సిందేనని స్పష్టం చేసారు.
కాగా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి చెప్పారు. ఇలా చేస్తే అది తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఇలాంటి సమయంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని ఆయన స్పష్టం చేశారు.