అస్సాంలోని మోరిగన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి డ్రగ్స్ కు బానిసై వాటిని కొనుగోలు చేసేందుకు ఏకంగా కొడుకునే అమ్మాడు. తన రెండున్నరేళ్ల కుమారుడిని రూ.40వేలకు విక్రయించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం.. మోరిగాన్‌లోని లహరిఘాట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గువాహతికి ఆ ప్రాంతం సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అమీనుల్ ఇస్లాం అనే వ్యక్తి సాజిదా బేగమ్ అనే మహిళకు తన కుమారున్ని విక్రయించాడు. ఈ క్రమంలో ఆ కుమారుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమీనుల్ ఇస్లాం, సాజిదా బేగంలను ఈ మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
కాగా అమీనుల్ డ్రగ్స్ కు బానిస కావడంతో అతనితో గొడవపడ్డ అతని భార్య రుక్మినా బేగం తన తండ్రి ఇంట్లో తన కుమారుడితో కలిసి ఉంటోంది. అయితే తాజాగా అమీనుల్ తన కుమారుడికి ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించాలంటూ అతన్ని బయటకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతన్ని అమీనుల్ విక్రయించాడు.
అయితే తన కుమారున్ని తీసుకెళ్లిన తన భర్త 2, 3 రోజులు అయినా తిరిగి రాలేదు. దీంతో రుక్మినా కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఆగస్టు 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆ బాలున్ని రక్షించారు.
అమీనుల్ తన కుమారున్ని రూ.40వేలకు సాజిదా బేగమ్‌కు విక్రయించాడు. డ్రగ్స్ కొనుగోలు చేసేందుకే అతను ఆ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.