నిజంగా కొందరు మనుషులంటారు. వారికి మానవత్వం అనేది ఉండదు. సమాజంలో ఉన్న అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నా వీరికి కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఇలాంటి వారికి అసలు మనస్సు అనేది ఉండదు. తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచన ఎలాగూ ఉండదు సరికదా, అలా చేసే వారిని కూడా ఎద్దేవా చేసేలా వ్యంగ్యంగా మాట్లాడడం, కామెంట్లు చేయడం చేస్తుంటారు. సరిగ్గా అతను కూడా అలాగే చేశాడు. ఉన్న ఉద్యోగం ఊస్ట్ అయింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఓ వైపు కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడి జనాలు అల్లాడుతున్నారు. మరోవైపు కేరళపై ప్రపంచదేశాలు కరిగినీరవుతున్నాయి. సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ.. సొంతగడ్డ కష్టాలపై ఆ వ్యక్తి గుండెమాత్రం కరగలేదు సరికదా తోచిన సహాయం చేయకపోగా తన రాష్ట్రంలో జరుగుతున్న సహాయక చర్యలపై అతడు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీంతో నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి సాగనంపింది.
కేరళకు చెందిన రాహుల్ చెరు పాలయట్టు అనే యువకుడు మస్కట్‌లోని లులూ హైపర్ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కేరళ వరద బాధితుల కోసం ఎక్కడైనా శానిటరీ నాప్‌కిన్లు అవసరమైతే చెప్పాలంటూ ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కాగా దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ఎవరికైనా కండోమ్‌లు కూడా కావాలంటే చెప్పండి.. అని కామెంట్ పెట్టాడు. కనీసం మానవత్వం లేకుండా అతడు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో రాహుల్ స్పందిస్తూ.. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, తాగిన మైకంలో అలా చేశానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానన్నాడు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. అదేదో సోయి ముందు ఉండాలి కదా..!