సాధారణంగా తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వాళ్ళకీ చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతుంది. అనుక్షణం కనిపెట్టుకుంటూ తన ప్రాణంగా చూసుకుంటుంది. కానీ తల్లిని ప్రాణంగా చూసుకునే పిల్లలు మాత్రం చాలా అరుదు. ప్రమాదం ఉందని తెలిస్తే తల్లి తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పిల్లలను రక్షిస్తుంది. మరి ఆ తల్లి ప్రాణాలు ప్రమాదం లో ఉంటే పిల్లలు తమ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడతారా. చాలా కొద్ది మంది మాత్రమే ఆ పని చేయగలరు. అలాంటి ఓ కుమారుడే బెంగాల్ కి చెందిన సురాజిత్. తేనెటీగల బారి నుంచి తల్లిని రక్షించేందుకు వెళ్లిన సూరాజిత్ అదే దాడిలో మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్లోని రాయ్దిఘీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగరీత్యా తన భార్యతో నదియాలోని తాహెర్‌పుర్‌లో నివసిస్తున్న సూరాజిత్.. దుర్గాపూజ సెలవుల్లో రాయ్దిఘీ నాగేంద్రపూర్‌లోని తన సొంత ఊరికి కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం అతని తల్లి యథావిధిగా వంటగదిలో పని చేస్తోంది. గదిలో నుంచి వచ్చే పొగ కారణంగా బయటున్న తేనెటీగలు అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి తన తల్లిపై దాడి చేశాయి.
తల్లి కేకలు విన్న సురాజిత్ హుటాహుటిన వంట గదిలోకి వెళ్లి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తేనెటీగలు అతనిపై కూడా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.