కరోనా అందరి జీవితాలని అతలాకుతలం చేసేసింది. డబ్బున్న వాడు ఎలానూ బతికేస్తున్నాడు, కూలీనాలీ చేసుకునే వాళ్ళ పరిస్థితి చూసి జాలి తలచి జనం సాయపడుతున్నారు. ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయింది మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి. ఏకంగా ఆసుప్రతి బిల్లు చెల్లించుకోలేక భార్య మృతదేహాన్ని భర్త అక్కడే వదిలేశాడు. ఈ ఘటన తిరుపతిలోని స్విమ్స్‌లో జరిగింది. కడప జిల్లాకు చెందిన వివాహిత తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం స్విమ్స్ లో అడ్మిట్ అయింది.
ఆ మరుసటి రోజే పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. అయితే ఆసుపత్రి బిల్లు 30 వేలు తీసుకొస్తానని భర్త అక్కడి నుంచి మాయ మయ్యాడు. ఆ తరువాత తిరిగిరాలేదు. రెండ్రోజుల పాటు ఎదురు చూసి విషయాన్ని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్విమ్స్ అధికారులు. భార్య మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేశాడని భావిస్తున్నారు. అయితే వాళ్ళు చికిత్స కోసం చేరినప్పుడు ఇచ్చిన ఆధార్, రేషన్ కార్డులు కూడా నకిలీవని తేలింది. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.