సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరూ కూడా తమ బ్యాంకు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను, యూపీఐ, కార్డు పిన్ సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని.. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు మాత్రం ఇంకా ఆ మాటలను పట్టించుకోకుండా సదరు సున్నితమైన సమాచారాన్ని దుండగులకు చెబుతున్నారు. దీంతో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
ముంబైలోని బొరివలి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఓ వ్యాపారవేత్త ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్ ద్వారా పలు సరుకులు ఆర్డర్ చేశాడు. అవన్నీ వచ్చాయి కానీ.. తాను అందులో ఆర్డర్ ఇచ్చిన రెండు భుజియా ప్యాకెట్లు మాత్రం రాలేదు. వాటి విలువ రూ.400. దీంతో అతను సదరు స్టోర్‌కు చెందిన ఫోన్ నంబర్ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయగా, అతనికి ఒక నంబర్ కనిపించింది. దానికి కాల్ చేశాడు. కానీ అది ఒక ఫేక్ నంబర్. ఈ క్రమంలో అవతలి వైపు ఉన్న వ్యక్తి ఆ వ్యాపారవేత్తకు సంబంధించిన బ్యాంకు వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ నంబర్, యూపీఐ పిన్ తదితర సమాచారాన్నంతా ఇవ్వాలని అడగ్గా.. ఆ వ్యాపారవేత్త మొత్తం వివరాలను చెప్పేశాడు.
అనంతరం వచ్చిన ఓటీపీలను కూడా ఆ వ్యాపార వేత్త అతనికి షేర్ చేశాడు. దీంతో 2 గంటల వ్యవధిలోనే నాలుగు సార్లు మొత్తం రూ.2.25 లక్షలను అవతలి వ్యక్తి కాజేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యాపార వేత్త స్థానిక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాబట్టి ఇప్పటికైనా.. సరే.. ఎవరూ కూడా తమ బ్యాంకు సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ చెప్పకండి. లేదంటే ఇలాగే డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది.