నేరస్థులు చట్టానికి దొరకకుండా తప్పించుకుంటే ఏం జరుగుతుందో తెలిపేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒక వ్యక్తి రెండు దశాబ్దాల కిందట ఫ్యాన్లను దొంగిలించాడు. కానీ అతనికి తాజాగా శిక్ష పడింది. ఈ విచిత్రమైన సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శంకర్ (55) అనే వ్యక్తి 1998 మార్చి 23వ తేదీన అక్కడి కోట్‌వలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ షాపులో రెండు ఫ్యాన్లను దొంగిలించాడు. అయితే వాచ్‌మన్ అలర్ట్ కావడంతో అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి ఫ్యాన్లను తీసుకున్నారు. కానీ చాకచక్యంగా అతను తప్పించుకున్నాడు. దీంతో అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు.
అయితే ఇటీవలే శంకర్ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భూపేంద్ర ఆచార్య ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి శంకర్‌కు ఒక ఏడాది జైలు శిక్ష, రూ.1వేయి ఫైన్ విధించారు. ఆ ఫ్యాన్ల ఖరీదు అప్పట్లో రూ.500 కానీ.. ఇప్పుడు రూ.1వేయి ఫైన్ విధించడం విశేషం. అప్పుడే అతను లొంగిపోయి శిక్షను అనుభవించి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. ఎప్పుడో శిక్షా కాలం పూర్తి అయి ఉండేది. ఏది ఏమైనా.. నేరస్థులు ఇలా సుదీర్ఘకాలం తప్పించుకుంటే ఇలాగే శిక్షలు కూడా ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడతాయి. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ అని చెప్పవచ్చు.