మునుగోడు బై పోల్..వ్యూహాలు రెడీ?

-

ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి…టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు ఫైట్ నడుస్తోంది…రోజురోజుకూ రాజకీయం మారిపోతుంది…ప్రతి పార్టీ రోజుకో కొత్త వ్యూహంతో ముందుకొస్తుంది. ఇలా రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్న సమయంలోనే మునుగోడు రాజకీయాలు ఇప్పుడు మరింత హీట్ పెంచాయి. అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…బీజేపీలో చేరడానికి సిద్ధమైన నేపథ్యంలో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయి. వాస్తవానికి రాజగోపాల్ ఎప్పుడో బీజేపీలోకి రావాల్సింది…కానీ బీజేపీ ఎప్పటికప్పుడు సమయం కోసం చూసి రాజగోపాల్ చేరికని వాయిదా వేసుకుంటూ వచ్చింది.

అలాగే కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన రాజగోపాల్…ఎప్పటికప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ని ఓడించే సత్తా బీజేపీకే ఉందని కామెంట్లు చేస్తూ వచ్చారు. రాజగోపాల్ తో బీజేపీ రాజకీయం నడిపిస్తూ వచ్చింది…ఇక తాజాగా అమిత్ షా తో భేటీ అయిన రాజగోపాల్…బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఓపెన్ గానే ఈ విషయాన్ని చెప్పేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వస్తాయి..అప్పుడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడంతో పాటు నల్గొండలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడు ఆ దిశగానే బీజేపీ ముందుకెళుతుంది.

పరిస్తితులని చూసుకునే రాజగోపాల్ చేత రాజీనామా చేయించి ఉపఎన్నికల బరిలో దించాలని చూస్తుంది. ఆగష్టులో రాజీనామా చేయించి.. డిసెంబర్ లో జరిగే గుజరాత్ ఎన్నికలతో పాటు మునుగోడు ఉపఎన్నిక పెట్టాలని కేంద్రం భావిస్తుంది.

అయితే ఈ ఉపఎన్నికని టీఆర్ఎస్ ముందే గ్రహించి…మునుగోడులో పని చేయడం మొదలుపెట్టింది…అక్కడ ప్రజలకు వరాలు ఇవ్వడం స్టార్ట్ చేయనుంది…అలాగే బలమైన అభ్యర్ధిని పెట్టడానికి రెడీ అవుతుంది…ఇప్పటికే ఈ విషయంపై మంత్రి జగదీష్ రెడ్డితో…కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఇంకా దూకుడు పెంచాలని అనుకుంటుంది. జిల్లాకు చెందిన జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మునుగోడులో కాంగ్రెస్ గెలుపు బాధ్యతని తీసుకోనున్నారు. మొత్తానికి మునుగోడు బై పోల్ వార్ లో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version