దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఆదివారం హఠాత్మరణం చెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాకేష్ ఝున్‌ఝున్ వాలా వయసు 62 ఏళ్లు. కిడ్నీ సమస్యతోపాటు పలు అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల ఆస్పత్రిలో చేరారు.
స్టాక్ మార్కెట్‌లో అత్యంత లాభాలు అర్జించిన వ్యక్తిగా ఝున్‌ఝున్ వాలాకు గుర్తింపు ఉంది. ఆయనను ఇండియన్ వారెన్ బఫెట్ అని కూడా పిలుస్తుంటారు. ఇటీవల ఆకాష్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించారు. గత వారమే ఈ విమానయాన సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. రాకేశ్ ఆస్తి విలువ దాదాపు రూ.35 వేల కోట్లు ఉంటుందని సమాచారం. 1985లో ఐదు వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించిన ఆయన వేల కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.