మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉపఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికపై మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఆ లేక ఉంది. అధికారం కోసం బిజెపి మతాల మధ్య చిచ్చు పెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిజెపి అవసరమైందన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ లంచగొండి కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బిజెపి ముందుకు వచ్చిందని మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉన్న పార్టీని గెలిపించాలని కోరారు.