కరోనా ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ట్రాన్స్ యూనియన్ సిబిల్ చెబుతున్న వివరాల ప్రకారం గతేడాది అక్టోబర్ కన్నా ఈ ఏడాది అక్టోబర్ వరకు క్రెడిట్ కార్డుల కోసం ఎంక్వయిరీలు ఏకంగా 106 శాతం వరకు పెరిగాయి. దీంతో గతంలో కన్నా బ్యాంకులు ఇప్పుడే ఎక్కువగా క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డులను తీసుకుని వాడడం వరకు బాగానే ఉంటుంది, కానీ వాటి బిల్స్ ను సరిగ్గా కట్టడంలో కొందరు విఫలమవుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులను తీసుకుని వాటిని మెయింటెయిన్ చేయలేక చేతులెత్తేస్తుంటారు. అయితే ఎవరైనా సరే ఎన్ని క్రెడిట్ కార్డులను తీసుకోవాలి ? ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు ? అంటే…
ఎవరైనా సరే గరిష్టంగా ఎన్ని కార్డులను అయినా ఉపయోగించవచ్చు. ఎన్ని బ్యాంకుల నుంచి అయినా ఎన్ని కార్డులను అయినా పొందవచ్చు. కానీ వస్తున్న సంపాదనకు అనుగుణంగా కార్డులను తీసుకోవాలి. ఉదాహరణకు మీకు ఏడాదికి రూ.5 లక్షల వరకు సంపాదన ఉందనుకుంటే రూ.10 లక్షల వరకు లిమిట్ ఉండేలా ఎన్ని క్రెడిట్ కార్డులను అయినా తీసుకోవచ్చు. అంటే.. అన్ని కార్డుల లిమిట్ కలిపినా రూ.10 లక్షలు మించకూడదన్నమాట. ఈ విధంగా కార్డులను పొందవచ్చు.
ఇక కొందరు తాము ఏ తరహా క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నామో అని సరిగ్గా చూడకుండానే కార్డులను పొందుతుంటారు. కానీ అది సరికాదు. ఎందుకంటే షాపింగ్ ఎక్కువగా చేసే వారు రివార్డ్స్, క్యాష్ బ్యాక్ కార్డులను తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఖర్చు చేసిన దాంట్లో నుంచి కొంత మొత్తం మళ్లీ రిటర్న్ వస్తుంది. అలాగే ఎక్కువగా విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసే వారు ట్రావెల్ కార్డు పొందాలి. ఇక వాహనాల మీద ఎక్కువగా తిరిగే వారు ఫ్యుయల్ కార్డులను పొందడం ఉత్తమం. దీంతో చేసే ఖర్చులకు కొంత మొత్తాన్ని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా కార్డులను ఉపయోగించాలి.
అలాగే ఎక్కువ సంఖ్యలో కార్డులు ఉంటే వాటికి పేమెంట్లు నెల నెలా చెల్లించడంలో కన్‌ఫ్యూజన్‌కు గురవుతుంటారు. అలాంటి వారు క్రెడిట్ కార్డుల బిల్లులను చెల్లించే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని వాడాలి. దీంతో కార్డులను ఆ యాప్‌లలో యాడ్ చేస్తే ఏ కార్డుకు బిల్లు ఎంత వచ్చింది, డ్యూ డేట్ ఎప్పుడు ఉంది వంటి వివరాలను ఒకే వేదికపై చెక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో కార్డుల బిల్లులను మిస్ కాకుండా చెల్లించవచ్చు. ఇలా క్రెడిట్ కార్డులు ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా సులభంగా వాటిని మేనేజ్ చేయవచ్చు.