దాదాపు వందలాది మందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకున్న ప్రమాదకర కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు విరుగుడు తమకు దొరికిందని చైనా ప్రకటించింది. కరోనా వైరస్ నుంచి బాధితులు కోలుకుంటున్నారని సంచలన ప్రకటన చేసింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో, కరోనా వ్యాధి సోకిన వారిలో చికిత్స పొంది, 243 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇక వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, కరోనా సోకి ఇప్పటివరకూ 259 మంది మరణించగా, మరో 11 వేల మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన ప్రకటనతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.