‘సినిమా’ రాజకీయం: చిరంజీవి ఎఫెక్ట్…వెనక్కి తగ్గుతారా?

-

ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా టిక్కెట్ల అమ్మకంలో అనేక అవతవకలు జరుగుతున్నాయని, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుని ప్రజలపై భారం మోపుతున్నారని చెప్పి…జగన్ ప్రభుత్వమే సినిమా టిక్కెట్లని అమ్మడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మడానికి రెడీ అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్టసవరణ బిల్లు-2021ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని… సినిమా టిక్కెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొందరు సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, అంతేకాకుండా స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నారని ఇలాంటి వాటిపై నియంత్రణ తీసుకురావడానికే చట్టంలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

అంటే ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు…. మొదటివారంలో టిక్కెట్ల రేటు పెంచడానికి అవకాశం లేదు. దీని వల్ల భారీ బడ్జెట్ సినిమాలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై సినీ పరిశ్రమ తీవ్ర అసంతృప్తిగా ఉంది. అలాగే నిత్యవసరాలు, ఇతర వాటిపై పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న ప్రభుత్వం… సినిమా టిక్కెట్ల విషయంలో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి స్పందిస్తూ… తగ్గించిన టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని, దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసమని, దయచేసి ఈ విషయంపై పునరాలోచించాలని జగన్ ప్రభుత్వాన్ని చిరంజీవి కోరారు. అంటే పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు… అవసరం బట్టి సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలనేది చిరంజీవి ఉద్దేశం. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకునే దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సినిమా టిక్కెట్ల అంశంపై చిరంజీవి అభిప్రాయాన్ని చర్చిస్తామని, సీఎంతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. అంటే టిక్కెట్ల ధరల అంశంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version