మాజీమంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. అలాగే రాష్ట్ర హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాజాగా దీనిపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని, తనని రాజీనామా చేయమనడం హేమమైన చర్య అని ఆమె చంద్రబాబుపై నిప్పులుచెరిగారు.