దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పై వ్యాట్ తగ్గిస్తూ బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఐదు నుండి పది రూపాయల వరకు తగ్గాయి. దాంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. కాగా గ్యాస్ ధరలు మాత్రం సామాన్యుల కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ ఎంపీ మేనకా గాంధీ గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెట్రోల్ ధరలు తగ్గించారని… వంటగ్యాస్ ధరలు కూడా తగ్గించాలని మేనకాగాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ధరలను తగ్గిస్తే సామాన్యులకు పెద్దఎత్తున ఉపశమనం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇక సొంత పార్టీ నాయకురాలు గ్యాస్ ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.