మహేంద్ర సింగ్ ధోనీ… క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత క్రికెట్ చరిత్రలో చెప్పుకోదగ్గ పేర్లలో ధోనీ ఒకరు. ఆయన కెప్టెన్సీలో టీమిండియా సాధించిన విజయాలు ఎన్నో. అంతెందుకు 2011 వరల్డ్ కప్ తీసుకున్నా కూడా 2011 వరల్డ్ కప్ ను ఇండియా గెలిచిందంటే దానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఎన్ని విజయాలు సాధించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. మళ్లీ కిందికి రాక తప్పదు. ప్రస్తుతం ధోనీ ఫామ్ లో లేడు. అప్పటి పదును లేదు. అప్పటి ధోనీ కాదు. ఆ హెలికాప్టర్ షాట్. వికెట్ కీపర్ గా ఆయన చాకచక్యం, ఆయన కెప్టెన్సీలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అయితే.. ఇవన్నీ ఒకప్పటి మాటలే. అందుకే… ధోనీని టీ20 క్రికెట్ నుంచి తప్పించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ధోనీకి టీ20ల్లో స్థానం కల్పించలేదు.
వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు ప్రకటించిన టీమిండియా జట్టులో ధోనీ పేరు లేదు. ఆ సిరీస్ కు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేసింది కమిటీ. దీంతో ధోనీ అభిమానులంతా ధోనీని టీ20 మ్యాచుల నుంచి తొలగించినట్టేనని మధన పడుతున్నారు. అయితే.. ఈ సిరీసుల్లో మాత్రమే ధోనీ ఆడట్లేదు. రెండో వికెట్ కీపర్ కోసమే ఈసారి ధోనీని పక్కన బెట్టాం.. అలా అని ధోనీ టీ20 కెరీర్ ముగిసినట్టే అని అనుకోవద్దు అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో అన్నాడు. చూద్దాం.. ధోనీ టీ20 కెరీర్ ఎలా ఉంటుందో.