కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్‌పీఎఫ్ ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరారు. ఈ పరీక్షలను ఆంగ్లం, హిందీల్లో నిర్వహిస్తున్నారని.. దీని వల్ల ఇంగ్లీష్, హిందీలను చదవని అభ్యర్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇకపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు రాజ్యాంగం గుర్తించిన భాషల్లోనూ కేటీఆర్ కోరారు.
పోటీ పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలన్న జాతీయ నియామక సంస్థ సూచనను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇకపోతే.. పోటీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఓ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనూ ఉండనున్నాయి. తెలుగుతో పాటు మొత్తంగా 13 ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.