సింగరేణిని కేంద్రం వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్ శ్రేణులు రేపు ధర్నాకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు బాల్క సుమన్ మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని అన్నారు. మోదీ దోస్త్ అదానీకి సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బండి సంజయ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మూడుసార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. మళ్లీ నాలుగోసారి 4 బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించకపోతే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పిన మాటమీద నిలబడటం లేదని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థకు గనులు కేటాయించాలన్నారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను సింగరేణి ప్రాంతాల్లో తిరుగనివ్వరని హెచ్చరించారు.