ఏపీలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్ అధికారులు కూల్చివేయడంతో మరింత అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో అయ్యన్న వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అయ్యన్న తన ప్రేలాపన తగ్గించుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు.
చోడవరంలోని అన్నవరంలో గత రాత్రి జరిగిన నియోజకవర్గ పార్టీ ప్లీనరీలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న రోడ్లపై తిరగకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వలంటీర్ల విషయంలో నాయకులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా వలంటీరు మాట వినకుంటే కనుక వెంటనే తొలగించాలన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.సత్యవతి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని పేర్కొన్నారు.