పోలవరం ప్రాజెక్టు పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరమనేది జాతీయ ప్రాజెక్టు అని…. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరు.. దశలవారీగా చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని… 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు.
అక్కడి వరకు ఉన్నవారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని.. త్వరగా అయిపోయే పనులు చేసి, పోలవరంలో కమీషన్లు కొట్టేశారని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశారని.. అందుకే మోడీ పోలవరాన్ని ఏటిఎంగా మార్చారని ఆరోపించారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల వరదలకు డయాఫ్రం వాల్ సైతం కొట్టుకుపోయిందని.. ఇప్పుడు వీటిని మళ్ళీ కట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిందని.. దాని ఘనత చంద్రబాబుదేనన్నారు. జగన్ సీఎం అయ్యాక చిత్తశుద్దితో పోలవరం పనులు చేస్తున్నారని.. రూ.67 లు ఉన్న డీజిలు ధరని కేంద్రం రూ 110 చేసిందని వెల్లడించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ విధించక తప్పలేదని.. ఏలూరు ప్రమాద ఘటనలో ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.