ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బీఆర్‌ఎస్.. పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించారు. దళిత బంధుతో ఇప్పటివరకు బీసీల కోసం కొనసాగుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లను కేసీఆర్ ప్రకటించారు.
సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో భారతావనికే తలమానికంగా ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం అని తేలిపోయిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అద్భుతంగా ప్రజల శ్రేయేస్సు కోరే విధంగా వుంది అన్నారు.
అలాగే ప్రజలకు కొండంత అండ గా బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చడం పట్ల సంతోషంగా ఉందన్నారు. తాజా మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా చెప్పడం మంచి విషయం అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయన్నారు.