హైదరాబాద్ అభివృద్ధిపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

-

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ కూడా బిజినెస్ పడిపోతుందని, అమరావతిలో మారిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమరావతిలో ధరలు ఎలా పడిపోయాయో అందరం చూశామన్నారు. కేసీఆర్ రాకుంటే హైదరాబాద్ కూడా మరో అమరావతిలా మారుతుందని రియాల్టీ వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. కానీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయం పక్క రాష్ట్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అర్థమైంది కానీ ఇక్కడి వారికి అర్థం కాలేదన్నారు. ఇక్కడకు వచ్చిన రజనీకాంత్ మనం హైదరాబాద్‌లో ఉన్నామా? న్యూయార్క్‌లో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారన్నారు. అక్కడి రజనీకి అర్థమైంది కానీ, ఇక్కడి గజనీలకు అర్థం కాలేదని విపక్షాలను ఉద్దేశించి అన్నారు.

ఇది ఇలా ఉంటె, తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవికుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి)తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరారు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి మంత్రి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ది టికెట్లు అమ్ముకుంటున్న దౌర్బాగ్య పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా.. అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పాలించే సత్తా కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఒకే ఒక్క ఎజెండా అదే రైతుల ఎజెండా అన్నారు. ప్రతిపక్షాలది బూతులు మాట్లాడే ఎజెండా అని దుయ్యబట్టారు. బూతులు మాట్లాడటం చాలా సులువు, కానీ నీళ్లు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అంబేడ్కర్ విగ్రహం కట్టడం కష్టం అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version