స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణల్లో పసలేదని ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని సీఐడీ విచారణ తీరుతో తేలిపోయిందని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి అయినా టీడీపీ అధినేతకు, లోకేశ్ కు, ఇతర నేతలకు వచ్చినట్టు జగన్ రెడ్డి గానీ, అతని జేబు సంస్థ సీఐడీ గానీ నిరూపించ లేకపోయిందని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా తప్పుడు కేసులో ఇరికించి, అన్యాయంగా జైలుకు పంపారన్న టీడీపీ వాదన నిజమని నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. జగన్ ఆదేశాల ప్రకారం నడుచుకున్న సీఐడీ చివరకు ఒక ‘గాసిప్ ఏజెన్సీ’గా నిలిచిందని విమర్శించారు.
టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించిన సొమ్మును అవినీతి సొమ్ముగా చూపేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్యకర్తలు పార్టీ కోసం అందించే ప్రతి రూపాయి పారదర్శకంగా ఉంచుతామని, కార్యకర్తలు, పార్టీకి మధ్య జరిగే చెల్లింపులు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు తెలియపరుస్తామని ఆయన అన్నారు. అధికార మదంతో వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ధూళిపాళ్ల, వైసీపీ నేతలను ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు ఎంతో దూరం లేదన్నారు.