రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేరు రైతులకు సాగునీరందించేందుకు రూ.104 కోట్లతో చేపట్టిన మూడు మినీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడతారు.
అనంతరం ధర్మసాగర్ మండల కేంద్ర నుంచి వేలేరు మండల కేంద్రం వరకు రూ.25 కోట్లతో వేసిన డబుల్‌రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.10 కోట్లతో చేపట్టిన నారాయణగిరి-పీచర రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శోడషపల్లి శివారులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ తర్వాత హైదరాబాద్ తిరుగుపయణమవుతారు.
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి పర్యటనతో పట్టణమంతా గులాబీ మయమైంది. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.