గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించాలని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రచారానికి అతితక్కువ సమయం మాత్రమే ఉండటంతో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రతిఓటరును అభ్యర్థించాలని అన్నారు.
ఎన్నికల ముందురోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ చార్జి మంత్రులు, శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని.. కూటమి నాయకులంతా కలసికట్టుగా పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి కృషి చేయాలి అని స్పష్టం చేసారు.