పవన్ కనీసం దసరాకు పులి వేషం వేసుకొచ్చినా బాగుండేది : పేర్ని నాని

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దసరాకు బస్సు యాత్ర మొదలుపెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ బస్సు యాత్రను వాయిదా వేసినట్లు ప్రకటించారు. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ.. “దసరాకు వస్తాను… మీ సంగతి చూస్తాను” అన్న పవన్ నాయుడు ఇప్పుడెక్కడున్నాడు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ కనీసం దసరాకు పులి వేషం వేసుకొచ్చినా బాగుండేదని ఎద్దేవా చేశారు. “బస్సు యాత్రకు తూచ్ అంట. పొద్దునేమో లోకేశ్ నాయుడు తూచ్ అన్నాడు, మధ్యాహ్నానికి పవన్ నాయుడు తూచ్ అన్నాడు. ఇద్దరి యాత్రలు క్యాన్సిల్. ఇద్దరి యాత్రలకు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వాలి కదా.

పవన్ బస్సు యాత్ర ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు…షూటింగులు ఏమైనా ఉన్నాయా? అడ్వాన్సులు ఇచ్చే ప్రొడ్యూసర్లకు ఆయాసం వస్తోందేమో కానీ, మనం ఆయాసం లేకుండా అడ్వాన్సులు తెగ తీసుకుంటున్నాం కదా! నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు అడ్వాన్సులు తీసుకున్న సినిమాలు పూర్తవ్వాలంటే 2050 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఎవరో ఒకరిని ముంచాల్సిందే… జెండా మోసిన కార్యకర్తనో, డబ్బులిచ్చిన నిర్మాతలతోనో, దర్శకులనో ముంచాలి. పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్. అసలు, పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీని ఎందుకు వదిలేశాడో చెప్పాలి.

సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ కల్యాణ్. చిరంజీవి ప్రజల కోసం పనిచేస్తే, పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదు. చంద్రబాబు చేసిన తప్పులను జగన్ కు ఆపాదిస్తున్నారు. పవన్ రాజకీయాలన్నీ చంద్రబాబు కోసమే. అమరావతి అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం… పవన్ వస్తారా? చిలక జోస్యంలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియదా? చిలక జోస్యంలో కేవలం వైసీపీ సీట్లే వస్తాయా?” అంటూ పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version