కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి : సబితా ఇంద్రారెడ్డి

-

రంగారెడ్డి కందుకూరు మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో పలు గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మతతత్వ పార్టీ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, యువకులు ఆ పార్టీ రొంపిలో పడకుండా చూడాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను విస్తరించారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్‌ తదితర పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని కోరారు.

 

ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని అన్నారు. చేవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఏర్పడడంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు భయపడుతున్నారని వివరించారు. ప్రజలకు సీఎం కేసీఆర్‌ పాలనపై నమ్మకం, విశ్వాసం కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version