విశాఖపట్నంలోని తగరపువలస పుట్ బాల్ గ్రౌండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైసీపీ మంత్రులు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార బస్సు యాత్ర తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించేందుకు అని ఆయన తెలిపారు. అయితే, జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఉంటే నేను తప్పు చేయలేదని బెయిల్ అడగండి.. విచారణకు సహకరిస్తాను బెయిల్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు అంటూ మంత్రి మండిపడ్డారు.
అంతే కాకుండా, సమాజంలో బడుగు వర్గాలకు అత్మగౌరవం కల్పించి, ఆ విలువ చూపించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమాజంలో రాజసంతో జీవించే స్థితికి తెచ్చారని తెలిపారు.వైయస్ఆర్ సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నో అన్యాయాలకు, అవమానాలకు గురయ్యారని మంత్రి అప్పలరాజు చెప్పారు. అడుగడుగునా ఆయన ప్రదర్శించిన కుల అహంకారాన్ని, అధికార మదాన్ని వెనుకబడిన కులాలవారు, దళితులు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. సీఎం వైయస్ జగన్ అన్ని కులాలు, అన్ని వర్గాలను ఒకేలా చూస్తున్నారని, అనేక కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పారు. ఓ మత్స్యకారుడిని మంత్రిని చేశారని, మరో మత్స్యకారుడు మోపిదేవి వెంకటరమణను పార్లమెంటుకు పంపారని తెలిపారు.