దేశవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా నిర్వహించే పండుగ గణేష్ నవరాత్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. అయితే.. గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల కోసం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు మంత్రి తలసాని. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తలసాని. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.లక్షలు, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తారని వివరాలు వెల్లడించారు మంత్రి తలసాని. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతామని పేర్కొన్నారు మంత్రి తలసాని.