అర్చకుల చేతుల్లో ఉన్న భూములకి సంబంధించిన పర్యవేక్షణ దేవదాయ శాఖదే అని స్పష్టం చేశారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్చకులు చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని వారు అనుభవించవచ్చు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవదాయ శాఖదే.. దాని మీద ఫలసాయం పొందే అవకాశం మాత్రమే ఖాస్తుదారులకు ఉంటుంది. నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ వారిని దేవదాయ శాఖలో తీసుకుంటున్నాం. దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది. పరిపాలనా కోసం మాత్రమే రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నాం.
ఐఏఎస్ అధికారులు.. రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా..? రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప.. నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా..? 4.20 లక్షల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉంది. వీటిల్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. దేవుడి మాన్యం భూముల్లో ఆక్రమణలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సీఎం జగన్ ఆదేశంతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశాం. ప్రతి మూడేళ్లకోసారి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి. ఎన్నో అక్రమాలు జరిగినా.. నాటి టీడీపీ హయాంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు అని ఆయన వెల్లడించారు.