తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు సత్యవతి రాథోడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.
భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా లోతట్టు ముంపు గ్రామాలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోందని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. అంతేకాకుండా.. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సత్యవతి రాథోడ్ సూచించారు.