మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌లోని విభేదాలు బయట పడ్డాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో, ఒక్కరు తప్ప తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ సిన్హాను కలవలేదు. ఆ ఒక్కరు ఎవరంటే… వి.హనుమంతరావు. వీహెచ్… సిన్హాను కలవడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే బండకేసి కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం కలవడం ఏంటి… ఇదేమైనా చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా? అంటూ వీహెచ్ పై మండిపడ్డారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు పలికినప్పుడు వీహెచ్ వెళ్లి కలవడంలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. “అయినా రాహుల్ కు లేని అభ్యంతరం నీకెందుకు? నువ్వు బండకేసి కొడితే పడి ఉండడానికి మేం పాలేర్లమా? అసలు, బండకేసి కొట్టడానికి నువ్వెవరు? ఎవర్ని కొడతావు బండకేసి? వీహెచ్ వయసుతో పోలిస్తే నువ్వో పోరగాడివి” అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.