టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిటి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. లోకేశ్ పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజోలు మండలం బి.సావరం గ్రామంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఎక్కడ పాదయాత్ర చేసినా టీడీపీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయని వెల్లడించారు ఎమ్మెల్యే రాపాక.
టీడీపీలో వర్గ పోరు ఉందని, యువగళం సందర్భంగా అది అడుగడుగునా బయటపడుతోందని తెలిపారు. లోకేశ్ ది యువగళం కాదని, గొడవల గళం అని రాపాక అభివర్ణించారు. ఇక, టీడీపీ కార్యకర్తలు ఓ మహిళా సర్పంచిపై దాడికి దిగారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అని ఎమ్మెల్యే రాపాక విమర్శించారు.
“రాజోలులో జరుగుతున్న యువగళం యాత్ర సమస్యల వలయంగా మారింది. యువగళం పాదయాత్రలో ఫ్లెక్సీల యుద్ధం జరుగుతోంది. సాధారణంగా ఫ్లెక్సీల యుద్ధం వైసీపీ, టీడీపీ మధ్య జరగాలి. వాళ్ల ఫ్లెక్సీ వీళ్లు చింపారని, వీళ్ల ఫ్లెక్సీ వాళ్లు చింపారని గొడవపడాలి. కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్లు వాళ్ల ఫ్లెక్సీలు వాళ్లే చింపుకుంటున్నారు. తాటిపాక సర్పంచి ఫ్లెక్సీలు పెడితే చింపేశారు. మరుసటి రోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అదే పరిస్థితి! ఇది ఎలా తయారవుతోందంటే… ఫ్లెక్సీలు చింపుకునేది వాళ్లే, గొడవలు పడేది వాళ్లే… చివరికి వైసీపీ వాళ్లు చింపారంటూ మాపై ఆరోపణలు చేసే స్థితికి వచ్చారు. మహిళలను గౌరవించే సంప్రదాయం తెలుగుదేశం పార్టీలో లేదు” అంటూ రాపాక తీవ్ర విమర్శలు చేశారు.