నాణ్యమైన భోజనం అందుకోవడం పేదలందరి హక్కు అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, పూర్వ ప్రాథమిక విద్య కోసం వచ్చే బాలలకు నాణ్యమైన సార్టెక్స్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈనెల ఒకటో తేదీ నుంచి తమ ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. గర్భిణులు, బాలింతలకు రోజుకు 125 గ్రాములు, 3 నుంచి 6 సంవత్సరాల్లోపు బాలలకు 75 గ్రాముల చొప్పున నెలలో 26 రోజులకు బియ్యాన్ని అందజేస్తారని వెల్లడించారు. లబ్ధిదారులకు ఇంటింటికి వచ్చి బియ్యం అందిస్తారని చెప్పారు. ఇంతవరకు గతంలో పనిచేసిన ఏ ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించలేదని, తొలి సారి తమ ప్రభుత్వం గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని వెల్లడించారు. మనసున్న మంచి ప్రభుత్వం తమదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో ప్రవీణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.