పీసీసీ రేసులోకొచ్చిన ఆ నేత దూకుడు పెంచారా

-

టీ కాంగ్రెస్ లో సీనియర్ నేత ఎప్పుడు వివాదాల వైపు కన్నెత్తి చూడని ఆయన సడన్ గా యాక్టివ్ అయ్యారు. ఇన్నిరోజులూ ప్రజా సమస్యలపైనే స్పందించే ఆయన ఇప్పుడన్ని విషయాల పై దూకుడు పెంచారు. పొలిటికల్‌ గా ఫుల్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ రేసులో అనూహ్యంగా తెరపైకొచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.


తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సాధారణంగా జీవన్ రెడ్డి తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. తాను అనుకున్న విషయం సూటిగా చెప్పడం.. సబ్జెక్ట్‌ వరకే మీడియాతో మాట్లాడేవారు. ఇతర విషయాల జోలికి పోకుండా.. తన జిల్లా వరకో, లేక తాను మాట్లాడాల్సిన ప్రజాసమస్య వరకే ఆయన పరిమితం అయ్యేవారు. అందుకే రైతుల సమస్యలు..ఎమ్మెల్సీ అయ్యాక నిరుద్యోగుల సమస్యలపై మాత్రమే తన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య ఆయన క్రమంగా వాయిస్‌ పెంచుతున్నారు.

ఇక ఉద్యోగ సంఘాల నాయకుల పై ఆయన ఎప్పుడు విమర్శలు చేసింది లేదు.. పీఆర్సీ అంశం తెర మీదకు వచ్చినప్పటి నుండి జీవన్ రెడ్డి వాయిస్ పెంచారు. ఉద్యోగ సంఘాల నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలతో కొట్లాడేవారని.. కానీ, ఇప్పుడు ప్రభుత్వాలను అడుక్కునే స్థాయికి దిగజారిపోయారని విమర్శలు చేశారు. ప్రభుత్వంతో టీఎన్జీవో,టీజీవో సంఘాల నాయకులు లాలూచీ పడి ఉద్యోగ సమస్యలు గాలికి వదిలేశారంటూ విమర్శలు చేశారు.

ఉద్యోగ సంఘాలతో పాటు.. అటు మంత్రుల మీద కూడా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు జీవన్‌ రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల కోటా లో మంత్రియై ఉద్యోగ సమస్యల్ని గాలికి వదిలేశారని ఫైరయ్యారు. తాజాగా సీఎం మార్పు అంశంపై కూడా స్పందించారు. కేటీఆర్ ని సీఎం చేస్తే వారసత్వ అంశం తెర మీదకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. మంత్రి ఈటలను ముఖ్యమంత్రి చేయండం బెటర్ అంటూ కామెంట్ చేశారు. బీసీ నాయకుడు సామాజిక న్యాయం కూడా జరిగినట్టు ఉంటుందని అన్నారు.

మాటలే కాదు.. జీవన్‌ రెడ్డి వ్యవహార శైలి కూడా మారిపోయింది. అసెంబ్లీలో మీడియా మిత్రులతో అభిప్రాయాలు పంచుకోవడం..సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు జీవన్ రెడ్డి. అయితే కాబోయే పీసీసీ చీఫ్ జీవన్ రెడ్డి అని ప్రచారం జరగడం అధికారిక ప్రకటన జరిగే లోపు నిర్ణయం వాయిదా వేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఎలాగూ కాబోయే పీసీసీ చీఫ్‌ జీవన్ రెడ్డే అని కాంగ్రెస్‌ వర్గాల్లో ఫీలింగ్ కూడా ఉంది. పీసీసీ చీఫ్‌ నియామకం ఆగింది కానీ.. తీసుకున్న నిర్ణయం మాత్రం అపలేదన్నది ఓపెన్ టాక్. అందుకే జీవన్ రెడ్డి అన్ని విషయాలపై స్పందించడం మొదలుపెట్టినట్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version