బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించారు. ముందుగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కవిత అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అర్చకులు కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం కొండగట్టు ఆలయ పునర్నిర్మాణంపై ఆలయ అధికారులను కవిత ఆరా తీశారు. ఆలయ పునర్నిర్మాణం గురించి అధికారులు కవితకు వివరించారు. కేసీఆర్ పాలనలో ఆలయాల అభివృద్ధి జరుగుతోందని కవిత అన్నారు. కొండగట్టు కోవెల కూడా మరో యాదాద్రిలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
కొండగట్టు నుంచి కవిత నిజామాబాద్ జిల్లాకు బయల్దేరారు. నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కవిత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.