రఘురామ కృష్ణంరాజు వైకాపా నుంచి అనుకున్నది ఆలోమోస్ట్ సాధించేసినట్లే! ఇక ఆయన కాషాయ కండువా కప్పుకోవడమే ఆలస్యం! ఈ రాజకీయ విశ్లేషణల సంగతి కాసేపు పక్కన పెడితే… నిజంగా రఘురామకృష్ణం రాజుకు బీజేపీ నుంచి అంతగట్టి హామీ వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు పలువురు వ్యక్తపరుస్తున్న సందేహం! నిజంగానే జగన్ కు వ్యతిరేకంగా అమిత్ షా నుంచి రఘురామకృష్ణం రాజుకు ఆస్థాయి భరోసా కలిగించి ఉంటే… ఆ ప్రభావం బీజేపీ – వైకాపాలపై ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ఇదే క్రమంలో రాజకీయ ప్రయోజనాలకోసం, ఆర్ధిక ప్రయోజనాల కోసం బీజేపీని ఆశ్రయిస్తున్న కొందరు ఎంపీల జాబితాలో రఘురామకృష్ణం రాజు చేరినట్లే.. అలాగే అర్థిక అవసరాలకోసం ఎవరైనా ఎప్పుడైనా ఏపార్టీనుంచైనా బీజేపీలో చేరవచ్చని మరోసారి బీజేపీ అధిష్టాణం సంకేతాలు ఇచ్చినట్లే! ఇది “రాజకీయ అవినీతి” అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా మోడీ పాలన సాగిస్తున్నారని.. మోడీపై ఒక్క అవినీతి మచ్చకూడా లేదని బీజేపీ నేతలు తెగ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో… ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ అవినీతి మచ్చలు కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అంతా అనుకుంటున్నట్లుగా… రఘురామకృష్ణం రాజుని బీజేపీ సంకనెక్కించుకుంటే… జగన్ – మోడీ మధ్య బంధానికి వచ్చే సమస్యలు ఏమిటనేది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్న. అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ బీజేపీకి వైకాపా నుంచి పూర్తిమద్దతు లభిస్తున్న తరుణంలో… అది మోడీకి అవసరం ఉందా లేదా అనేది ఒక్కటే పరమావధా… లేక మోరల్స్ కి తిలోదకాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది!
ఇక్కడ వినిపిస్తోన్న మరోమాట ఏమిటంటే… నిజంగా రఘురామకృష్ణం రాజు లేకుండా బీజేపీకి గడవని పరిస్థితి అయితే… ఆయనతో రాజినామా చేయించి, కమలం గుర్తుతో గెలిపించుకుని చేర్చుకోవచ్చు కదా అనేది. ఏపీలో బీజేపీ ఆ సాహసం చేయగలుగుతుందా? ఎంతో గొప్పపార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు… ప్రజలకు ఇలాంటి సంకేతాలు ఇవ్వడం కచ్చితంగా వారి క్రెడిబిలిటీని ప్రశ్నించేదే అని మరికొందరి వాదన. కాంగ్రెస్ నాయకులు ఆర్థిక అవినీతికి పాల్పడ్డారని ఒకపక్క విమర్శలు చేసే బీజేపీ నేతలు… వారు చేస్తున్న ఈ రాజకీయ అవినీతిని ఎలా సర్థిచెప్పుకుంటారనేది ఇక్కడ ప్రశ్న!
న్యాయం.. చట్టం.. ధర్మం అనే అంశాల్లో… న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రఘురామకృష్ణం రాజుని బీజేపీ చేర్చుకోవచ్చు, దానికి రాజ్యాంగంలోని కొన్ని అవకాశాలను చూపించొచ్చు. కానీ… అది ధర్మబద్ధమేనా? పైగా రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న వైకాపా నుంచి ఇప్పుడు బీజేపీ ఒక ఎంపీని చేర్చుకోవడం అత్యవసరమా? రాజకీయ అవసరమా? అసలు… అవసరమా? బీజేపీ అధిష్టాణమే ఆలోచించుకోవాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు!