సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ పై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపధ్ తో దేశం మొత్తం అగ్నిగుండంలా మారిందని అన్నారు. మొహమ్మద్ ప్రవక్త పై బిజెపి నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని.. ఇప్పుడు డిఫెన్స్ దగ్గర నిధులు లేవు అంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలి అని నిలదీశారు. ఇలాంటి విధానాలు బీజేపీ మానుకోవాలని హితవు పలికారు.
అగ్నిపధ్ పేరుతో నాలుగేళ్లు సర్వీసులు పెట్టడం దారుణమని అన్నారు. నాలుగేళ్ల తరువాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చారని గుర్తు చేశారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ దేశ ప్రతిష్టను మంటకలుపుతున్నాయి అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీకి పాలించే నైతిక హక్కు లేదని వి .హనుమంత రావు వ్యాఖ్యానించారు.