కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఈ కూటమి 293 సీట్లు సాధించింది. ఇండియా కూటమి 233 సీట్లతో సరిపెట్టుకున్నది. దీంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 09న సాయంత్రం 06 గంటలకు ఢిల్లీలోని కర్తవ్యపఢ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఎన్డీయే తో కలిసి పని చేయడం మాకు కొత్త కాదు. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తాం. ఎన్డీయే ను విస్తృత పరచడం నిరంతర ప్రక్రియ అన్నారు. విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇక శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇప్పటికే మోడీ ఆహ్వానాన్ని అంగీకరించారు.