కరోనా భయంతో గదిలోంచి మూడేళ్లుగా బయటకురాకుండా ఉంటున్న తల్లీకూతురు..

-

మనలో చాలామందికి.. ఒక్కరోజు ఇంట్లో ఉండాలంటే.. పిచ్చబోర్‌ కొడుతుంది. టీవీ, ఫోన్‌ ఏదో ఒకటి చూస్తూ కాలక్షేపం చేస్తాం. లాక్‌డౌన్‌లో అన్నిరోజులు ఉన్నప్పుడే బోర్‌కొట్టి ఏం చేయాలో తెలియక తలలు బద్దలుకొట్టుకున్నాం.. అలాంటిది.. ఓ తల్లీకూతురు మూడేళ్లుగా ఒకే గదిలో ఉంటున్నారు.. అస్సలు బయటకు రాలేదు. కారణం ఏంటో తెలుసా కరోనా. ఇది జరిగింది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో..
కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఈ కొవిడ్ ఫోబియాతో మూడేళ్లుగా తల్లీకుమార్తె ఇంట్లోనే ఉన్నారు. 43 ఏళ్ల మణి, ఆమె కుమార్తె 20 ఏళ్ల దుర్గా భవానీ.. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. మూడు సంవత్సరాలుగా వారి ఇంటి నుండి బయటకు రాలేదు. తలుపులు మూసి ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మణి భర్త సూరిబాబు స్థానిక ప్రజారోగ్య కేంద్రంకి సమాచారం అందించారు.
అలా ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వచ్చి.. ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి డోర్లు తీయమన్నా.. తల్లీకూతురు తీయలేదట. పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో వీరిద్దరినీ బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి.., కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్ -19 ఫోబియాతో బాధపడుతున్నారని, చంపడానికి ఎవరో చేతబడి చేస్తున్నారని వాళ్లు చెబుతున్నట్లు భర్త సూరిబాబు చెప్పారు.
ఈ మూడేళ్ళూ ఇద్దరూ ఒకే దుప్పటి కప్పుకుని నిద్రపోయారు. మణి భర్త సూరిబాబు చెప్పిన వివరాల ప్రకారం.. కొవిడ్ దశలో ఇద్దరూ చాలా అరుదుగా తమ ఇంటి నుండి బయటకు వచ్చేవారు. ఇక అప్పటి నుంచి మూడేళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. సూరిబాబు వారికి భోజనం అందించేవాడు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు వారికి భోజనం పెట్టేందుకు కూడా అనుమతించలేదు. బయటకు వెళ్లి ఉండమని చెప్పారు. అతను వేరే ఇంట్లో ఉంటూ ఆహారం సిద్ధం చేసి ఇంటి కిటికీకి నుంచి ఇచ్చేవాడట..
తన భార్య, కుమార్తె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సూరిబాబు పీహెచ్‌సీకి సమాచారం అందించాడు. పీహెచ్‌సీ వైద్యురాలు సుప్రియ వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఇంటికి పంపించారు. మరోవైపు పోలీసులు కూడా వచ్చారు. బలవంతంగా ఇంట్లోంకి వచ్చి..గదిలోకి వెళ్లగానే.. దుర్వాసన వచ్చింది. పోలీసుల సహకారంతో ఎలాగోలా.. ఇద్దరినీ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. జీజీహెచ్‌లో చేర్పించారు. వీరిని రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు సూపరింటెండెంట్ హేమలత తెలిపారు.
బయటకు రమ్మని సూరిబాబు ఎంత చెప్పినా.. వీరు వినిపించుకోలేదు. చివరకు ఆరోగ్యం క్షీణించడంతో విషయాన్ని బయటకు చెప్పాడు. ఎట్టకేలకు తల్లీకూతురిని బయటకు తెచ్చారు. చేతబడి చేసి చంపేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారని కూతురు భవానీ చెబుతుందట. ఒక అబ్బాయిని చంపారని, తనను చంపుతామని బెదిరించారని అంటోంది ఆ కుమార్తె. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. తన మాట వినకపోతే.. సూరిబాబు అప్పుడే పోలీసుల సాయం తీసుకోవచ్చు కదా.. ఒక నెల కాదు రెండు నెలలు కాదు.. ఏకంగా మూడేళ్లు బయటిప్రపంచం చూడకుండా అలా ఒకే గదిలో ఎందుకు ఉన్నారు..? అప్పుడే ఇతరులసాయం తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు కదా.. అసలు వాళ్లు గదిలో ఉండి ఏం చేశారు అని డౌట్‌ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version